మేము చేసిందే కరెక్ట్. మేము చేసిందే వేదం అన్నట్టుగా వ్యవహరించిన వారు.. నేడు ఎన్నికల్లో వాళ్లకు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని, తాము తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్లోని లోటుపాట్లు సరిదిద్దుకుంటామని మాట్లాడుతున్నారు. ఇందులో అత్యంత ముఖ్యమైనది రైతుబంధు పథకం. రైతు బంధుకు లిమిట్స్ పెట్టాలని గత కొన్ని సంవత్సరాలుగా నిలదీస్తుంటే, ప్రశ్నిస్తుంటే తప్పించుకున్న అధికార పార్టీవారు.. నేడు రైతు బంధుకు లిమిట్స్ పెడతామని అంటున్నారు.
మరి ఇంతకాలం ఏ అర్హత లేకుండా, ఏ ప్రాతిపదిక చూడకుండా ఎకరాలకు ఎకరాలు ఉన్న వారికి లక్షల, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎలా పంచిపెట్టారు? రాష్ట్రవ్యాప్తంగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా మింగేసిన బడా భూస్వాముల సంగతి ఏమిటి? ఆ సొమ్ము రికవరీ చేస్తారా? లేక భరిస్తారా అంటూ నిలదీస్తున్నది సామాన్య ప్రజానీకం. రైతుబంధు పథకం అమలైనప్పటి నుంచి నేటి వరకు రైతుబంధు ద్వారా లబ్ధి పొందినవారు అందరూ కూడా అసలైన అర్హులైన లబ్ధిదారులు కాదని మీరే గుర్తించినట్లైంది కదా! ఇంత చిన్న విషయాన్ని గుర్తించడానికి ఇన్ని సంవత్సరాలు సమయం పడుతుందా?
ఈ లెక్కన మీరు అధికారం చేపట్టడానికి అర్హత ఉన్నట్టేనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోగలరా అంటున్నది ప్రజానీకం. ఇప్పటికైనా రైతు బంధుకు లిమిట్స్ పెట్టకపోతే మీకు లిమిట్స్ తప్పవని, రాష్ట్రంలో మీ ఉనికి ప్రమాదంలో పడుతుందని గ్రహించి రైతు బంధు పథకాన్ని సవరించుకుంటామని అంటున్నారు. అనర్హులైనవారికి రైతుబంధు పథకాన్ని అందజేసి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇదే ధనాన్ని నిరుపేద కుటుంబాలకు అందించి వారికి సొంత ఇంటి స్థలంగానీ, వ్యాపార నిమిత్తం ప్రోత్సాహకరంగా నగదు రూపంలో అందించినా వేల కుటుంబాలు బాగుపడేవి.
- సింగోజు మురళీకృష్ణ ఆచార్యులు, సిద్దిపేట